రాష్ట్రంలోని ధెంకనల్ జిల్లాలో తుముసింగా పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోగర్ గ్రామంలో విషాదం సంఘటన చోటు చేసుకంది. ఇంట్లో నలుగురు పిల్లలు ఆడుకుంటుండగా పటాకులు పేలి నలుగురు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడిన పిల్లలను రక్షించి సమీపంలోని పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ధెంకనల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు పిల్లలు మృతి చెందగా, మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇంట్లో పటాకులు నిలువ ఉంచడం వల్ల ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.