ఔషధరంగ గమ్యస్థానం

ఔషధరంగంలో పరిశోధనలు, జీవవైవిధ్య సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధిలో దేశానికే హైదరాబాద్‌ గమ్యస్థానంగా ఉన్నదని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖల మంత్రి పీయూష్‌గోయల్‌ ప్రశంసించారు. ఔషధరంగ పరిశ్రమలకు పన్నుల రాయితీల విషయంలో త్వరలో జాతీయస్థాయిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు. జాతీయస్థాయిలో ఫార్మారంగంలో అద్భుత ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయని, త్వరలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామన్నారు. హెచ్‌ఐసీసీలో బయో ఏషియా- 2020 గ్లోబల్‌ సమ్మిట్‌లో భాగంగా మంగళవారం ‘ప్లేయింగ్‌ క్యాచ్‌ అప్‌ ఆర్‌ ప్రిపేరింగ్‌ లీడ్‌ ఆఫ్‌ది సీఈవో’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలో ఔషధరంగానికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, నిర్దిష్ట విధానం లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమంటూ తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ వేసిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిస్తూ.. దేశంలో ఔషధాలు, ఔషధ పరికరాలు ప్రతిపౌరునికి అందుబాటు ధరలో ఉండేలా చూస్తామన్నారు.